గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను, భూకబ్జాలను అడ్డుకుంటున్న హైడ్రా మరో కీలక చర్య చేపట్టింది. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో గాయత్రి అసోసియేషన్ సభ్యులు తమ కాలనీ పార్క్ కబ్జాకు గురయిందని అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన హైడ్రా అధికారులు దాదాపు ఏడు గుంటల భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించారు.
శుక్రవారం హైడ్రా సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆక్రమణకు గురైన పార్క్ చుట్టూ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను తొలగించారు. అలాగే అక్కడ అక్రమంగా నిర్మించిన షెడ్లను నేలమట్టం చేశారు. పార్క్ స్థలాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని భూకబ్జాదారులకు గట్టి హెచ్చరిక ఇచ్చారు.
భూకబ్జా నుండి తమ కాలనీ పార్క్‌ను రక్షించిన హైడ్రా అధికారుల చర్యపై గాయత్రి అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. హైడ్రా నిర్ణయాలు ప్రజలకు రక్షణ కల్పిస్తున్నాయని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమ చర్యలను సహించబోమని స్పష్టం చేశారు.
ఇటీవల కాలంలో గ్రేటర్ పరిధిలో అక్రమ భూకబ్జాలు పెరుగుతుండటంతో హైడ్రా చర్యలు వేగంగా సాగుతున్నాయి. భూకబ్జాదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న అధికారులు, పార్క్ స్థలాన్ని రక్షించడం ద్వారా ప్రభుత్వ నిబంధనలను అమలు చేస్తున్నారు.