కోసిగి మండలంలో పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు కేటాయించి, గృహనిర్మాణానికి రూ.5 లక్షల సహాయం అందించాలని కోరుతూ సీపీఐ, ప్రజాసంఘాలు ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు అర్హులైన పేదలకు స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో కేటాయించడంతో పేదలు వాటిని ఉపయోగించలేకపోయారని నాయకులు విమర్శించారు. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన 1.50 సెంట్ల స్థలం తక్కువగా ఉండటంతో, పేదలు ఇళ్లను నిర్మించలేకపోయారని తెలిపారు. అలాగే, ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల ఆర్థిక సహాయం మాత్రమే అందించడంతో పునాదులు కూడా వేయలేకపోయారని పేర్కొన్నారు.
ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలాలు కేటాయించాలని నిర్ణయించడం సానుకూలమని, కానీ ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.4 లక్షలు సరిపోవని, దాన్ని రూ.5 లక్షలకు పెంచాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. అంతేగాక, సిమెంట్, ఇసుక, ఇటుక, ఇనుము వంటి నిర్మాణ సామాగ్రిని ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజు, మండల నాయకులు జీవన్ చిన్న, ప్రకాష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యస్.ఈరేష్, రైతు సంఘం కార్యదర్శి ముకప్ప, డిహెచ్పిఎస్ మండల కార్యదర్శి ఓంకార్ స్వామి, సీపీఐ నాయకులు నరసింహులు తదితరులు పాల్గొన్నారు. పేదలకు అందుబాటులో ఉండే విధంగా గృహ నిర్మాణ ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు.
