మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై దీన్ని ప్రారంభించారు. పాఠశాల ప్రిన్సిపాల్ వాని, ఉపాధ్యాయులు, సిబ్బంది కలెక్టర్కు స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థుల ప్రయోగాలను పరిశీలించారు.
విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడంలో ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు చాలా ఉపయోగకరమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను పరిశీలించి, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ సిద్ధాంతాలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పరిశోధనాత్మకంగా ఆలోచించేలా ప్రోత్సహించాలన్నారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, ఇతర సహాయ కార్యాకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని కలెక్టర్ సూచించారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినాలని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ఉత్సాహపరిచారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు రెడ్డి, శ్రీమాన్ రెడ్డి, జీవన్, రమేష్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు మరింత నిర్వహించి, విద్యార్థుల ప్రతిభను వెలికితీయాలని నాయకులు అభిప్రాయపడ్డారు.