కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం తుజాల్ పూర్ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. 32 ఏళ్ల సుంకరి ప్రవీణ్ గౌడ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
మూడేళ్ల క్రితం ఇంటి నిర్మాణానికి అవసరమైన 3 లక్షల రూపాయలు కామారెడ్డి ఫైవ్ స్టార్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుండి ప్రవీణ్ గౌడ్ రుణంగా తీసుకున్నాడు. మొదట్లో ఈఎంఐ లను సక్రమంగా చెల్లించినా, చివరి 8,000 రూపాయల రుణ చెల్లింపులో జాప్యం జరిగింది.
దీంతో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ సిబ్బంది ప్రవీణ్ గౌడ్ ను తీవ్రంగా వేధించడంతో పాటు ఇంటికొచ్చి దుర్భాషలాడారు. ఈ వేధింపులను తట్టుకోలేక మనోవేదనకు గురైన ప్రవీణ్ గౌడ్ గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
మృతుడికి భార్య అర్చన, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం వీధిన పడింది. గ్రామస్థులు ప్రవీణ్ గౌడ్ ఆత్మహత్యపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.