బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోవడం అభిమానులను నిరాశపరచింది. ఐదు టెస్టుల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆఫ్‌స్టంప్ బంతులకు ఔట్ అవుతూ తన బలహీనతను మరోసారి బయటపెట్టుకున్నాడు. ఈ కారణంగా కోహ్లీపై విమర్శలు పెరిగాయి. కొందరు అతనికి రిటైర్మెంట్ సూచన కూడా చేశారు.
ఈ పరిస్థితిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. సోషల్ మీడియా వేదికగా కోహ్లీకి కీలక సూచన చేశాడు. “మన మైండ్‌ని రీసెట్ చేయడం చాలా ముఖ్యం. ప్రతి బంతిని అర్థం చేసుకుని బౌలర్ గురించి మర్చిపోవడం ఉత్తమం. విరాట్ తన పోరాటాన్ని ఇష్టపడతాడు కానీ కొన్నిసార్లు అతని ప్రయత్నాలు ఒత్తిడికి గురి చేస్తాయి” అని చెప్పాడు.
డివిలియర్స్ కోహ్లీపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, అతని అనుభవం, నైపుణ్యం అన్నీ టీమ్‌కు చాలా అవసరమని పేర్కొన్నాడు. “ప్రతి బంతి తర్వాత మళ్లీ ఫోకస్ చేయడం నేర్చుకోవాలి. ఇది ప్రపంచంలోని ప్రతి బ్యాటర్‌కు అవసరమైన లక్షణం. కోహ్లీ తన బలహీనతను దాటుకొని మళ్లీ ఫామ్‌లోకి రావడాన్ని ఆశిస్తున్నా” అని అన్నారు.
డివిలియర్స్ ఇచ్చిన ఈ సూచనలు కోహ్లీ మైండ్‌సెట్ మార్చడానికి కీలకమవుతాయని భావిస్తున్నారు. విరాట్ తన విశేష నైపుణ్యం, పోరాట పటిమతో త్వరలోనే తిరిగి నిలబడతాడని అభిమానులు ఆశిస్తున్నారు.