శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యం పట్ల కృషి చేయడం తన ప్రధాన లక్ష్యమని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా పోతుకుంట రోడ్డు లోని మాత శిశు సంక్షేమ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు. డయాలసిస్ గదులను, పరికరాలను పరిశీలించి వైద్యుల నుండి సమాచారం పొందారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 50 కి పైగా డయాలసిస్ సెంటర్లు ఉన్నాయని, ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగిని ఆదరించి, సరైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అనారోగ్య సమస్యల కోసం ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సలహాలు ఇస్తున్న వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో డయాలసిస్ రోగులు చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది కానీ, ఇప్పుడు ధర్మవరంలోనే ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డయాలసిస్ స్టేట్ మోడల్ ఆఫీసర్ నిర్మల గ్లోరీ, డీఎంహెచ్వో పైరోజు బేగం, డిసిఐహెచ్ఎస్ తిపేంద్ర నాయక్, అనంతపురం డిసిఐహెచ్ఎస్ పాల్ రవి కుమార్, ఆరోగ్య ట్రస్ట్ కోఆర్డినేటర్ శ్రీదేవి, స్థానిక నాయకులు డోలా రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసం వైద్య సేవలను మరింత విస్తరించాలని వారు అభిప్రాయపడ్డారు.