మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ నాయకులు దళిత సంఘాల నేతల ఆధ్వర్యంలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్ర ప్రభాకర్ మాదిగ ఆధ్వర్యంలో జోగిపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి, అనంతరం అంబేద్కర్ విగ్రహం ముందు అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ, అమిత్ షా వ్యాఖ్యలు దళితుల మనోభావాలను దెబ్బతీశాయని, ఆయనను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ నుండి ఆయనను సస్పెండ్ చేయాలని, లేదంటే ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్ర ప్రభాకర్ మాదిగతో పాటు, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఆకుల పెంటయ్య, బిజెఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు జీ యెహన్, సీనియర్ జర్నలిస్టు గామిని జైపాల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎమ్మార్పీఎస్, దళిత నాయకులు ఈ నిరసనలో భాగస్వాములయ్యారు.
నిరసనకు విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేస్తూ, దళితుల హక్కుల కోసం కృషి కొనసాగిస్తామని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం చట్టప్రాయ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.