తెలంగాణ కేబినెట్ భేటీ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. కొత్త రెవెన్యూ చట్టం (ఆర్ఓఆర్) బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై కేబినెట్లో చర్చించి, ఆమోదించి శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు.
పంచాయతీరాజ్ చట్ట సవరణలో భాగంగా, ఇద్దరికి మించి పిల్లలు ఉన్న వారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించే మార్పులు ప్రతిపాదించనున్నట్లు సమాచారం. రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులపైనా ఈ సమావేశంలో చర్చించి, అమలుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయనున్నారు.
మాజీ మంత్రి కేటీఆర్‌పై ఫార్ములా-ఈ రేసింగ్ వ్యవహారంలో కేసు నమోదు చేయడంపై గవర్నర్ అనుమతి ఇవ్వడంతో, ఆ అంశంపై ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి కార్యాచరణను కేబినెట్ చర్చించనుంది. దీనిపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
అదేవిధంగా, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై జస్టిస్ మదన్ బీ లోకూర్ కమిషన్ సమర్పించిన విచారణ నివేదికను కేబినెట్ చర్చించనుంది. ఈ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు కూడా అనుమతించనున్నారు.