పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేయని అభివృద్ధి పనులను ఏడాది కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేసినట్లు నిజాంపేట మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. శుక్రవారం పెద్దమ్మ తల్లి ఆలయ ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహిస్తూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలలో నాలుగు గ్యారెంటీలు అమలు అయ్యాయని వెల్లడించారు. మిగతా రెండు గ్యారెంటీలు కూడా త్వరలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు.
గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సామాన్య మానవునికి ఏమైనా లబ్ధి చేకూర్చింది ఏమిటో అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారికి నచ్చిన నాయకులకే బీసీ బందు, దళిత బంధు, ట్రాక్టర్లను అందించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని, ఇది వారి తగదు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటకు నిలబడిన తీరు ప్రశంసనీయమని, రెండు లక్షల రుణమాఫీ చేయడాన్ని వారు ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలో కాలయాపన చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్కీమ్ గురించి కూడా ప్రశ్నించారు. 75 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, నిరుపేదలకు ఇళ్లను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని తెలిపారు.
రానున్న స్థానిక ఎన్నికలలో, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో 14 గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, వార్డు మెంబర్లను కైవసం చేసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మారుతి, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.