పెరిగిన విద్యుత్ బిల్లుల భారాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్వతీపురం మన్యం జిల్లా కార్యవర్గ సభ్యులు దావాల రమణారావు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు విస్మరించారని మండిపడ్డారు.
విద్యుత్ చార్జీలను ట్రూ ఆప్ సర్దుబాటు పేరుతో భారాలు మోపడం దారుణమని అన్నారు. అక్టోబర్ నెలలో 386 రూపాయల బిల్లు వచ్చిన వినియోగదారుడికి, నవంబర్ లో 503 రూపాయల బిల్లు రావడం దారుణమని ప్రశ్నించారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలతో ప్రభుత్వ వైఖరి మారడాన్ని తీవ్రంగా విమర్శించారు.
ఆదానీ తో విద్యుత్తు ఒప్పందాల వల్ల ప్రజలపై అదనంగా లక్ష కోట్ల రూపాయల భారాలు మోపడం జరుగుతుందని, ఈ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలపై భారాలను తగ్గించాలని లేదంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఏ లక్ష్మణరావు, డి దుర్గారావు, కే రాము, ఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడతామని సిపిఎం నాయకులు చెప్పారు.