మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి గ్రామ శివారులో ఉన్న మనదుర్గా మాత గెస్ట్ హౌస్‌లో పోలీసులు అర్ధరాత్రి దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేసినట్లు మెదక్ డిఎస్పీ ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. ఈ దాడులు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నమ్మదగిన సమాచారం ఆధారంగా చేపట్టారు.
డిఎస్పీ ప్రసన్నకుమార్ రెడ్డి ప్రకటన ప్రకారం, గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన పేకాట నుండి రూ.49,100 నగదు, రూ.12 లక్షల విలువైన కాయిన్లు, పది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గెస్ట్ హౌస్ యజమాని సాయ గౌడ్, పేకాట నిర్వాహకులు సంతోష్ సింగ్, వెంకట్ రెడ్డి పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
పేకాట కారణంగా చాలామంది తమ ఆస్తులు పోగొట్టుకుంటున్నారని, ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సహకరించకుండా ఉండాలని ప్రజలకు డిఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా పేకాట ఆడుతున్నట్లుగా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
ఈ దాడి సమయంలో కొల్చారం పోలీస్ స్టేషన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్‌ఐ మహమ్మద్ గౌస్ పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యం ద్వారా చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టే చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.