కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని కోటనందూరు మండల ప్రజల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా 64 సంవత్సరాల క్రితం తేనే నుకయ్య ఆసుపత్రి స్థాపించబడింది. రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోటనందూరు పీహెచ్సీ సిబ్బంది, డాక్టర్లు, మరియు సేవా కమిటీ సభ్యులు స్థల దాతల కుటుంబీకులను సన్మానించారు.
స్థల దాతల మనవడులు మాట్లాడుతూ తమ తాతగారు స్థలం ఇచ్చినప్పటి నుంచి ఆసుపత్రి అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కోటనందూరు, రౌతులపూడి మండలాలు కలిసి ఉండేవి. కానీ జనాభా పెరిగిన నేపథ్యంలో రౌతులపూడి మండలం విడిపోయి 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందింది. అదే సమయంలో కోటనందూరు ఆసుపత్రి ఇప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగానే కొనసాగడం బాధాకరమన్నారు.
ప్రభుత్వాలు మారినా ఆసుపత్రి స్థితిలో ఎలాంటి మార్పు రాలేదని ఆయన తెలిపారు. 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని స్థానికులు, సేవా కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. అధికారుల సమర్ధత లేకపోవడం వల్లే అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ఆసుపత్రి అభివృద్ధి జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కోటనందూరు సిహెచ్ఎన్ రాజమణి, పీహెచ్ఎన్ నరసమ్మ, హెల్త్ విజిటర్లు విజయకుమార్, రాంబాబు, ఏఎన్ఎంలు, ఎం.ఎల్.హెచ్.పీలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, అల్లూరి సీతారామరాజు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కోటనందూరు ప్రజలు మెరుగైన వైద్య సేవలు పొందలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.