వాహనదారులెవరైనా పెట్రోల్ బంక్ అంటే ఇంధనం నింపుకునే ప్రదేశంగానే భావిస్తారు. కానీ, పెట్రోల్ బంక్‌లలో కొన్ని ఉచిత సేవలు కూడా లభిస్తాయి. అయితే చాలా మందికి వీటి గురించి తెలియక, ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇందులో నాణ్యత తనిఖీ, ప్రథమ చికిత్స, త్రాగునీరు, ఉచిత గాలి వంటి సేవలు అందుబాటులో ఉంటాయి.
పెట్రోల్ బంక్‌లలో ఇంధనం నాణ్యతపై అనుమానం ఉంటే, ఫిల్టర్ పేపర్ టెస్ట్ చేయించుకోవచ్చు. అలాగే, ఇంధనం సరైన పరిమాణంలో లభించిందో లేదో పరిశీలించేందుకు కూడా మీకు హక్కు ఉంది. ప్రమాదం జరిగినప్పుడు ప్రథమ చికిత్స అవసరమైన వారికి పెట్రోల్ బంక్‌లో ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంటుంది.
అత్యవసర సమయంలో పెట్రోల్ బంక్‌లలో ఉచితంగా ఫోన్ కాల్ చేసుకోవచ్చు. మహిళలకు ప్రయాణాల్లో పరిశుభ్రమైన మరుగుదొడ్లు దొరకడం కష్టమే. పెట్రోల్ బంక్‌లలోని టాయిలెట్లను ఉచితంగా ఉపయోగించవచ్చు. అలాగే, ప్రతి పెట్రోల్ బంక్ త్రాగునీటిని ఉచితంగా అందించాలి.
టైర్లకు గాలి నింపడానికి డబ్బు వసూలు చేయడం చట్టవిరుద్ధం. ప్రతి పెట్రోల్ బంక్ ఉచిత గాలిని అందించాలి. వీటిని అందించకపోతే సంబంధిత పెట్రోలియం కంపెనీల టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయొచ్చు. ఈ సేవలను తెలుసుకుని వాహనదారులు ఉపయోగించుకోవడం మంచిది.