ఏజన్సీలో రాజవొమ్మంగి మండల వ్యాప్తంగా 48 గంటల నిరవధిక బంద్ కొనసాగుతోంది. 1/70 చట్ట పరిరక్షణ డిమాండ్‌తో ఆదివాసీలు, వామపక్షాలు నిరసనకు దిగారు. ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు.
బంద్‌లో భాగంగా వ్యాపార సంస్థలు, మీ సేవా కేంద్రాలు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు బంద్‌కు పూర్తి మద్దతు తెలిపినట్లు కనిపిస్తోంది. రవాణా సేవలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
బంద్ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిఐ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘ నాయకులు వంతు బాలకృష్ణ, తాము సూరిబాబు, గంప నాగరాజు, సింగిరెడ్డి అచ్చారావు, కొండ్ల సూరిబాబు, కుంజం జగన్నాధ రావు, చీడి శివ, ఈక శ్రీనుబాబు, బొడ్డు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బంద్ విజయవంతం చేస్తున్నట్లు వారు తెలిపారు.