కర్నూలు జిల్లా కోసిగి మండలంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరిండెంట్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మద్యం స్వాధీనం చేసుకొని, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ధ్వంసం చేశారు. మొత్తం రూ.12 లక్షల విలువైన మద్యం నాశనం చేసినట్లు ఆయన తెలిపారు.
కోసిగి, కౌతాళం పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా అక్రమ మద్యం రవాణా జరుగుతుందని సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 85 కేసులు నమోదు చేయగా, 2442 లీటర్ల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మద్యం ప్రవాహాన్ని అరికట్టడానికి ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలించే మార్గాలను గమనించి, కఠినమైన తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు.
ఈ మద్యం ధ్వంస కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ భార్గవరెడ్డి, ఎస్సైలు చంద్రమోహన్, కార్తీక్ సాగర్, ఇతర పోలీసులు పాల్గొన్నారు. మద్యం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టే వరకు తనిఖీలు మరింత కఠినంగా చేపడతామని అధికారులు వెల్లడించారు.