దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు జరిగే ఈ జాతరకు సుమారు 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ రూ. 1.75 కోట్లతో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
వేములవాడ రాజన్న ఆలయం కోడె మొక్కులకు ప్రాచుర్యం పొందింది. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు తాగునీరు, మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, పండ్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ గోపురాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తుల తాత్కాలిక వసతి కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
జాతర సందర్భంగా ప్రత్యేకంగా 800 ఆర్టీసీ బస్సులను నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 25న శ్రీ స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున కూడా పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
మహాశివరాత్రి రోజున సాయంత్రం 6 గంటలకు అద్దాల మండపంలో మహా లింగార్చన, రాత్రి లింగోద్భవ సమయంలో మూడు గంటల పాటు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. ఆలయ వెనుక భాగంలో 700 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరారు.