అదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గం నేరడిగొండలో రైతులు జాతీయ రహదారిపై భారీ ధర్నా, రాస్తారోకో చేపట్టారు.మా పంటల్ని కొనండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతులు రహదారిపై బైఠాయించి తమ ఆవేదన వ్యక్తం చేశారు.

పత్తి తేమశాతాన్ని ప్రస్తుత 12% నుండి 20%కు పెంచాలని, పత్తి పంటను ఎకరానికి కనీసం 12 క్వింటాళ్లు, సోయా పంటను ఎకరానికి 10 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

ఆందోళన కారణంగా రెండు వైపులా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైతులు మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా పత్తి, సోయా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అయినా ప్రభుత్వాలు తమను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ:సముద్ర తీరంలో మళ్లీ సందడి – తెరుచుకున్న సూర్యలంక బీచ్ గేట్లు
తేమశాతం పేరుతో పంటలను తిరస్కరించడం అన్యాయమని, రైతుల కష్టాన్ని గుర్తించి పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

జిల్లా కలెక్టర్ వచ్చే వరకు రహదారిపై నుండి కదలబోమని రైతులు స్పష్టం చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని అదనపు కలెక్టర్‌తో మాట్లాడిన అనంతరం రైతులు ధర్నాను విరమించారు.
దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ ఆందోళనలో అనేక గ్రామాల రైతులు, అఖిలపక్ష నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
