భారత తపాలా శాఖ తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 50 సంవత్సరాలపాటు ప్రజల జీవితాల్లో భాగమైన రిజిస్టర్డ్ పోస్ట్ సేవను ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుండి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
టీచర్లు, లాయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగార్థులు, విద్యార్థులు, గ్రామీణ ప్రాంత ప్రజలు… ఎంతోమంది ఈ సర్వీసుపై ఆధారపడి జీవించారు. తక్కువ ఖర్చుతో అత్యంత విశ్వసనీయంగా సేవలు అందించిన ఈ రిజిస్టర్డ్ పోస్ట్ ఇప్పుడు మనకు గుడ్‌బై చెబుతోంది.
అయితే, ఇది పూర్తిగా ఆపేయలేదు. రిజిస్టర్డ్ పోస్ట్‌లో ఉన్న ముఖ్యమైన ఫీచర్లను ఇప్పుడు ‘స్పీడ్ పోస్ట్’లో విలీనం చేస్తున్నట్టు తపాలా శాఖ ప్రకటించింది. ఇకపై స్పీడ్ పోస్ట్ద్వారానే ఆ సేవలు అందించనున్నామని స్పష్టం చేసింది.
వినియోగం తగ్గడం కారణమా?
ఈ నిర్ణయానికి ప్రధాన కారణం – రిజిస్టర్డ్ పోస్ట్‌కు వినియోగదారులు తగ్గిపోవడమే. ఒకప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, విద్యాసంస్థలు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారానే సమాచారాన్ని పంపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితే మారిపోయింది.
డిజిటల్ కమ్యూనికేషన్ బాగా పెరిగింది. WhatsApp, Gmail, Zoom వంటి ప్లాట్ఫార్మ్లు అధికార పరంగా కూడా వినియోగంలోకి వచ్చాయి. ఇక డాక్యుమెంట్లన్నీ స్కాన్ చేసి మెయిల్ చేస్తే చాలు, పనులు పూర్తవుతున్నాయి.
దీంతో రిజిస్టర్డ్ పోస్ట్ అవసరం తక్కువైంది. ఇదే గణాంకాల్లోనూ కనిపిస్తోంది.
2011-12లో 24.4 కోట్ల రిజిస్టర్డ్ పోస్టులు పంపించగా, 2019-20 నాటికి ఈ సంఖ్య 18.4 కోట్లకు తగ్గిపోయింది. అంటే 25% తగ్గుదల.
స్పీడ్ పోస్ట్‌తో భవిష్యత్
ఇప్పుడు తపాలా శాఖ ఉన్నత గమ్యంతో స్పీడ్ పోస్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని చూస్తోంది.
రిజిస్టర్డ్ పోస్ట్‌లో ఉన్న ముఖ్య ఫీచర్లు — డెలివరీ ధృవీకరణ, ట్రాకింగ్, అడ్రస్‌కు కచ్చితంగా పంపించడం ఇవన్నీ స్పీడ్ పోస్ట్‌లో ఇప్పటికే ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో రెండు సర్వీసులు నడిపడం అవసరమా? అన్నది తపాలా శాఖకు ఎదురైన ప్రశ్న.
ఇక తక్కువ ఖర్చుతో వేగంగా సర్వీసులు అందించేందుకు స్పీడ్ పోస్ట్‌ను ప్రాధాన్యంతో ముందుకు తెస్తోంది.