“రాజు కావడం నాకు వద్దు” – రాహుల్ గాంధీ సంచలనం


దేశ రాజకీయాల్లో కీలక మలుపులు తిరుగుతున్న ఈ సమయంలో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఢిల్లీలో జరిగిన “రాజ్యాంగ సవాళ్లు: దృక్కోణాలు, మార్గాలు” అనే సదస్సులో ఆయన మాట్లాడుతూ – తాను దేశానికి రాజు కావాలని అస్సలు అనుకోవడం లేదని స్పష్టం చేశారు. “రాజు అనే భావనకే నేను వ్యతిరేకిని. ప్రజాస్వామ్యంలో ప్రజలే శాసకులు. నేతలు వారి సేవకులు మాత్రమే” అని తేల్చిచెప్పారు.

ఈ సందర్భంగా సభలో కొన్ని నినాదాలు వినిపించాయి – “ఇస్ దేశ్ కా రాజా కైసా హో, రాహుల్ గాంధీ జైసా హో”. వాటిపై రాహుల్ స్పందిస్తూ – “లేదండి, నేను రాజు కాను. నాకు అలాంటి ఆకాంక్షే లేదు” అని తేల్చారు.

ఇదే కార్యక్రమంలో ఆయన మరో సంచలన వ్యాఖ్య చేశారు – 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారీ స్థాయిలో రిగ్గింగ్ జరిగిందని, దాదాపు 70 నుంచి 100 సీట్లలో ఫర్జీ ఓట్ల వాడకమే జరిగిందని ఆరోపించారు. “మేము పూర్తి ఆధారాలతో రాబోయే రోజుల్లో ఈ విషయం బయటపెడతాం. అప్పుడు ఈ వ్యవస్థ కుదిలిపోతుంది” అని అన్నారు.

అంతేకాదు, కర్ణాటకలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓటర్ల సమీక్షలో 6.5 లక్షల ఓటర్లలో 1.5 లక్షలు నకిలీ ఓట్లు అని తేలిందని వెల్లడించారు. ఈ సమాచారం “ఆటమ్ బాంబులా పని చేస్తుంది” అని ఆయన హెచ్చరించారు.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ – “ఎన్నికల సంఘం తటస్థంగా ఉండాలి. కానీ ఇప్పుడు అది కొందరి చేతుల్లో ఉంది. 2014 నుంచే ఈ వ్యవస్థపై నాకు అనుమానం మొదలైంది” అని చెప్పారు.

ఇది దేశ రాజకీయ వ్యవస్థపై ఆయన వేసిన పలు ప్రశ్నలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ వీడియోలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పూర్తి విశ్లేషణ, ప్రజాస్వామ్యం పట్ల ఆయన కలల దృష్టికోణం, అలాగే ఎన్నికల వ్యవస్థలో జరిగే అవకతవకలపై ఆయన చేసిన హెచ్చరికలను సమగ్రంగా చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *