న్యూఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలతో పాకిస్తాన్ మళ్లీ అంతర్జాతీయ చర్చకు వస్తోంది. “పాకిస్తాన్ సహా రష్యా, చైనా, ఉత్తర కొరియా రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయి” అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ మాట్లాడుతూ – “పాకిస్తాన్ చరిత్రలో చట్టవ్యతిరేక, రహస్య అణు కార్యకలాపాలు కొత్తవి కావు.
ఇస్లామాబాద్ అనేక దశాబ్దాలుగా అక్రమ రవాణా, ఎగుమతి నియంత్రణ ఉల్లంఘనలు, రహస్య భాగస్వామ్యాలు, ఏక్యూ ఖాన్ నెట్‌వర్క్ ద్వారా అణు విస్తరణ లాంటి చర్యల్లో పాల్గొంటూనే ఉంది” అని పేర్కొన్నారు.
ALSO READ:సోషల్ మీడియా మోసాలపై సైబర్ పోలీసుల బిగ్ బ్రేక్ – రూ.107 కోట్ల రికవరీ
అదే సమయంలో, భారత్ ఈ అంశంపై అంతర్జాతీయ సమాజ దృష్టిని ఆకర్షించనుందని తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యల అనంతరం సోషల్ మీడియాలో విస్తృత చర్చ మొదలైంది.
ఈ ఏడాది ఏప్రిల్ 30 నుండి మే 12 మధ్య ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో 4.0 నుండి 4.7 తీవ్రత గల భూకంపాలు సంభవించడంతో, పాకిస్తాన్ రహస్య అణు పరీక్షలు నిర్వహించిందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, పాకిస్తాన్ చివరిసారిగా 1998లో చాగై-I, చాగై-II అణు పరీక్షలు నిర్వహించింది.
అదే సంవత్సరం భారతదేశం రాజస్థాన్‌లోని పోఖ్రన్‌లో చేసిన అణు పరీక్షలకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ అణు పరీక్షలు చేపట్టింది. అప్పటి నుంచి ఆ దేశం అధికారికంగా ఎలాంటి అణు పరీక్షలు జరిపినట్లు రికార్డుల్లో లేవు.
