నాగార్జునసాగర్, పులిచింతలకు భారీ వరద, జలాశయాలు నిండుకుండలు

నాగార్జున సాగర్, పులిచింతలకు భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టుల నీటి నిల్వ పూర్తి స్థాయికి చేరుకున్నాయి. నాగార్జునసాగర్ కు ఇన్ ఫ్లో 3,19,408 క్యూసెక్కులు కాగా, దిగువకు 2,89,356 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో పులిచింతల నిండు కుండలా మారింది. పులిచింతలలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది. దీంతో ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రీరాం తాతయ్య కలిసి బుధవారం 13 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. తొలుత కృష్ణమ్మకు నేతలు పూజలు చేసి, జలహారతి ఇచ్చి, సారె సమర్పించారు.
 
పులిచింతల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా గురువారం ఉదయానికి 167.94 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, 35.5 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతలకు గురువారం ఉదయానికి ఇన్ ఫ్లో 2,45,682 క్యూసెక్కులుగా ఉండగా, అంతే మొత్తం దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల నుండి కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజీకి పరుగులు పెడుతోంది. భారీగా నీటిని విడుదల చేయడంతో కృష్ణా పరీవాహక ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు. పులిచింతల నుండి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది.
 
ప్రకాశం బ్యారేజీకి ఇన్ ఫ్లో ..2,67,111 క్యూసెక్కులు ఉండగా, కాలువలకు 13,991 క్యూసెక్కుల నీటిని ఇస్తున్నారు. ఇక బ్యారేజీ 60 గేట్లు అరు అడుగుల మేర, పది గేట్లు అయిదు అడుగుల మేర ఎత్తి .. 2,53,120 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను, కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *