జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమీక్షలో త్రాగునీరు, వడగాల్పులు, పీ-4 సర్వే, రీ సర్వే, పీజీఆర్ఎస్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. మండల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు సమావేశంలో పాల్గొన్నారు.
వేసవిలో వడగాల్పులు అధికంగా ఉంటాయని, త్రాగునీటి సమస్యలు తలెత్తే ప్రాంతాలను ముందుగా గుర్తించాలని కలెక్టర్ సూచించారు. నీటి ఎద్దడి సమస్యను నివారించేందుకు మున్సిపల్ అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు.
జిల్లాలోని అన్ని త్రాగునీటి వనరులపై సంబంధిత అధికారులు పూర్తి సమాచారం కలిగి ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎక్కడా త్రాగునీటి సరఫరాపై ప్రతికూల వార్తలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, పీ-4 మోడల్ సర్వే, సిటిజన్ డెత్ ఆడిట్, E-KYC వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ, రీ సర్వే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. అన్ని గ్రామ, పట్టణ సచివాలయాల్లో పీజీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ ప్రారంభించాల్సిందిగా సూచించారు. అధికారులంతా తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో సమన్వయం చేసుకోవాలని, త్రాగునీటి సమస్యల నివారణకు కృషి చేయాలని ఆయన తెలిపారు.