తెలంగాణలో కాంగ్రెస్‌కు షాక్: ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్‌లో చేరిక

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది! బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ఓ ఎమ్మెల్యే తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఇరవై రోజుల క్రితం ఆయన బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి అధికార పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరుల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

అయితే నెల రోజులు కూడా కాలేదు… ఆ ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు పదిమంది వరకు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది తమ పార్టీలోకి వస్తారని అధికార పార్టీ చెబుతోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే తిరిగి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం గమనార్హం. ఇది బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది.

కేటీఆర్‌ను గద్వాల ఎమ్మెల్యే కలిసిన సమయంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి సరితా తిరుపతయ్యపై 7 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *