విత్తనబంతులను వెదజల్లి పచ్చదనం పెంపొందిద్దాం అని విశాఖపట్నం మెట్రోపాలిటన్ కమీషనర్ కె ఎస్ విశ్వనాథన్ అన్నారు. బుధవారం ఉదయం కైలాసగిరి పై విఎంఆర్ డిఎ ఆధ్వర్యంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ అందజేసిన విత్తనబంతులను వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలి అన్నారు.
వాతావరణ కాలుష్యంతో పర్యావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని, తద్వార భూతాపం విపరీతంగా పెరిగి ప్రకృతి వైపరీత్యాలు తరచు సంభవిస్తున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణకు తక్షణం చర్యలు తీసుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. జీవ వైవిధ్యం ఉపయోగాలు, ప్రస్తుతం అందులో జరుగుతున్న వివిధ మార్పులు ప్రతిఒక్కరు గుర్తించాలన్నారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు ఒక మొక్కను విధిగా నాటాలన్నారు.
విరివిగా మొక్కలను పెంచడం కోసం తగిన ప్రణాళికలను రుపొందిస్తున్నామని, మరీ ముఖ్యంగా విశాఖను గ్రీన్ విశాఖగా మార్చటమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. ఇదొక అత్యంత ప్రాధన్యమైన అంశంగా పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. ఈరోజు మర్రి, రావి, జువ్వి, చింత, ఏనుగు గురువింద, దిరిసిన, పొగడ, నిద్ర గన్నేరు, గంగ రావి, బాదం, అడవి బాదం, ఫాల్స్ అశోక, అడవి చింత, వేప, కరక్కాయ, ఇండుగ, రేల, తురాయి, రామాఫలం, సీతాఫలం, వేప వంటి దాదాపు 35 రకాలైన వృక్షజాతులకు చెందిన విత్తనాలను మట్టితో చేసిన సుమారు 3000 బంతులను గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ, విశాఖ వారి పర్యవేక్షణలో కైలాసగిరి కొండపై వెదజల్లడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి దాట్ల కీర్తి, డి ఎఫ్ ఒ శాంతి స్వరూప్ గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, రేంజ్ ఆఫీసర్లు శ్యామల, శివానీ, వర్క్స్ ఇన్స్పెక్టర్ సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.