ప్రముఖ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి ఓపెన్ఏఐపై గరళం కక్కారు. “ఓపెన్ఏఐ ఒక అబద్ధంపై నిర్మించబడింది” అంటూ, “తమ లాభం కోసం ఒక చారిటీని దొంగిలించారు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (Twitter) వేదికగా, హెలెన్ టోనర్ అనే యూజర్ పోస్ట్‌కు స్పందిస్తూ మస్క్ ఈ ఆరోపణలు చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఓపెన్ఏఐ తన అసలు లక్ష్యమైన లాభాపేక్ష రహిత ఏఐ పరిశోధనను పూర్తిగా పక్కనబెట్టి, ఇప్పుడు డబ్బు సంపాదించడంపైనే దృష్టి పెట్టిందని తెలిపారు.
మస్క్ మాట్లాడుతూ, ఓపెన్ఏఐ ఇప్పుడు విమర్శకులను సబ్‌పోనాల ద్వారా బెదిరించడం, న్యాయపరమైన ఒత్తిడి తేవడం వంటి చర్యలకు దిగిందని ఆరోపించారు. కాలిఫోర్నియాలో ఏఐ విధానాలపై చర్చ జరుగుతున్న సమయంలో, ఓపెన్ఏఐ లాభాపేక్ష రహిత కార్యకలాపాలపై విమర్శలు చేసిన న్యాయవాది నాథన్ కాల్విన్‌కు షెరీఫ్ ద్వారా నోటీసులు పంపించిందని తెలిపారు. ఇది విమర్శకుల గొంతును నొక్కే ప్రయత్నమని మస్క్ మండిపడ్డారు.
గతంలో కూడా ఎలాన్ మస్క్, ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ను “స్కామ్ ఆల్ట్‌మన్” అని పిలుస్తూ తీవ్రంగా విమర్శించారు. ఆయన మాటల్లో, ఓపెన్ఏఐ ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌కు అనుబంధ సంస్థగా మారిపోయి, కేవలం కార్పొరేట్ లాభాల కోసమే పనిచేస్తోందని పేర్కొన్నారు.
మస్క్ తన పాత భాగస్వామ్య ఒప్పందాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ, ఓపెన్ఏఐపై దావా కూడా వేసిన సంగతి తెలిసిందే. ఈ తాజా వ్యాఖ్యలతో మస్క్ – ఓపెన్ఏఐ వివాదం మళ్లీ ముదురుతోంది.
