ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. భద్రతా వ్యవస్థలు, దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై ఇప్పటికే సమగ్ర విచారణ ప్రారంభించాయని ఆయన వెల్లడించారు.
ఘటన వెనుక ఉన్న నిందితులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
“ఇలాంటి చర్యలు దేశ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు. ఎవ్వరూ చట్టానికి అతీతులు కారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఏ విధంగానూ విడిచిపెట్టం” అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేయడం ప్రభుత్వ ప్రాధాన్యత అని రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు.
ALSO READ:ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్
ఈ ఘటనపై కేంద్ర భద్రతా సంస్థలు, ఢిల్లీ పోలీసులు సమన్వయంతో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. పేలుడు మూల కారణాలు, ఉపయోగించిన రసాయనాల వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
దేశంలో శాంతి, భద్రతను భంగం చేయాలని చూస్తున్న శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని రాజ్నాథ్ సింగ్ అన్నారు. “ప్రజల భద్రతే మా మొదటి కర్తవ్యం. ఎవరైనా ఉగ్రవాదం లేదా విధ్వంసక చర్యలకు పాల్పడితే, వారికి తగిన శిక్ష తప్పదు” అని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర భద్రతా విభాగాలు సంయుక్తంగా ఘటనపై పూర్తి నివేదికను సిద్ధం చేస్తున్నాయి. త్వరలోనే దర్యాప్తు ఫలితాలు ప్రజలకు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
