కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలం గురుజాల గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలు, గోనెగండ్ల మండలంలోని గంజహళ్లి గ్రామంలో హజరత్ మహాత్మా బడే సాహెబ్ ఉరుసు మహోత్సవం జరుగనున్నాయి. మార్చి 5న గంధం, మార్చి 6న ఉరుసు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులతో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షలో త్రాగునీరు, శానిటేషన్, విద్యుత్ సరఫరా, శాంతి భద్రతలపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా భారీగా భక్తులు వచ్చే అవకాశముండటంతో ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత, సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పండుగ వేళ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పోలీస్ భద్రతను పటిష్టం చేసి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్, వివిధ శాఖల అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించి, వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.