ఉత్తరాఖండ్ సీఎం ధామిపై సుప్రీం ఆగ్రహం

సుప్రీంకోర్టు, వివాదాస్పద అధికారికి పదవి కట్టబెట్టాలని చూసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరాఖండ్ సీఎం ధామిపై సుప్రీం ఆగ్రహం

వివాదాస్పద అధికారికి ఉన్నత పదవి కట్టబెట్టే ప్రయత్నం చేసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఏం చేసినా చెల్లుతుందని అనుకోవద్దని, సీఎం అంటే రాజు కాదని హితవు చెప్పింది. ఈమేరకు బుధవారం ఓ పిటిషన్ విచారణలో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ల బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.

ఉత్తరాఖండ్ కు చెందిన ఐఏఎఫ్ ఆఫీసర్ ఒకరికి రాజాజీ టైగర్ రిజర్వ్ డైరెక్టర్ పదవి కట్టబెట్టేందుకు సీఎం ధామి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, సదరు అధికారి వ్యవహారం వివాదాస్పదమంటూ ఇతర అధికారులు, మంత్రులు అభ్యంతరం చెప్పారు. అయినా సీఎం ధామి వినిపించుకోకపోవడంతో పలువురు అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం.. ఐఎఫ్ఎస్ అధికారి రాహుల్ పై డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీ ఒకటి పెండింగ్ లో ఉందని, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన అధికారికి ఉన్నత పదవి కట్టబెట్టాలని చూడడమేంటని ప్రశ్నించింది. రాహుల్ పై సీఎం ధామికి ఎందుకంత ప్రేమ అని నిలదీసింది.

ఇతర సీనియర్ అధికారులు వద్దంటున్నా వినిపించుకోకుండా రాహుల్ కు డైరెక్టర్ పదవి కట్టబెట్టడానికి కారణమేంటని బెంచ్ ప్రశ్నించింది. ముఖ్యమంత్రులు పూర్వ కాలపు రాజుల్లాగా ప్రవర్తించొద్దని, మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనే తప్ప రాచరికంలో కాదని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికింది. సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ ఏఎన్ఎస్ నందకర్ణి స్పందిస్తూ.. ఆ వివాదాస్పద ఉత్తర్వులను సెప్టెంబర్ 3న ప్రభుత్వం వాపస్ తీసుకుందని కోర్టుకు తెలిపారు.

ఐఏఎస్ ఆఫీసర్ రాహుల్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలే తప్ప రాహుల్ ఎలాంటి తప్పు చేయలేదని కోర్టుకు వివరించారు. అయితే, రాహుల్ పై శాఖాపరమైన విచారణను ప్రభుత్వం ఎందుకు తొక్కిపెట్టిందని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవరిపైనా శాఖాపరమైన విచారణకు ఆదేశించలేరని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తుచేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *