ఉచిత ఇసుక పథకం దారితప్పింది దళారుల దోపిడీతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిన ఉద్దేశ్యం ప్రజలకు ఇసుక సులభంగా, తక్కువ ధరకు అందించడమే. అయితే కొందరు దళారులు ఈ పథకాన్ని తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.
ప్రభుత్వం నిబంధనలను సడలించినా, దాన్ని ఇసుకాసురులు తమకనుకూలంగా మార్చుకుని భారీ లాభాలు పొందుతున్నారు. దీంతో సామాన్య ప్రజలు ఇసుక కోసం గగ్గోలు పెడుతున్నారు.
తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు, చాగంటిపాడు, కళ్లంవారిపాలెం, ఐలూరు గ్రామాల్లోని ఇసుక క్వారీల్లో అక్రమ రవాణా బాగా పెరిగింది. ఒక్క ట్రాక్టర్ ఇసుక లోడింగ్‌కు రూ.500 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నారు.
ఆ తర్వాత ఆ ట్రాక్టర్ లోడ్‌ను రూ.3 వేల నుంచి రూ.5 వేల మధ్య విక్రయిస్తున్నారు. ఈ విధంగా టన్ను ఇసుక ధర రూ.1000 దాటుతోంది. క్వారీల్లో బాటఖర్చుల పేరిట రూ.200 వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:SSMB 29 నుంచి సెన్సేషనల్ అప్‌డేట్.. అభిమానుల్లో హైప్ పీక్‌లో!
అధికారులు ధరలను నియంత్రించడంలో విఫలమయ్యారు. ఉచిత ఇసుక ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించాలి, ఎంత వసూలు చేయాలి అనే స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో దళారులు అదునుచూసుకుని దోపిడీ చేస్తున్నారు.
ప్రభుత్వ ఉచిత ఇసుక పథకం కింద ప్రజలు ఎడ్లబండ్లు లేదా ట్రాక్టర్లతో స్వయంగా ఇసుక తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, ప్రాక్టికల్‌గా కొంతమంది మాత్రమే దానిని వినియోగించుకోగలుగుతున్నారు.
రాత్రివేళల్లో అక్రమంగా లారీల్లో ఇసుక నింపి విక్రయాలు సాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇకనైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుని దళారుల దోపిడీని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
