అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళల స్టాళ్లను సందర్శించి, వారు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ, మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. మహిళలపై అఘాయిత్యాలు చేసిన వారికి కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించారు. మహిళలు ఆర్థికంగా స్వయంసాధికారులుగా మారేందుకు ప్రభుత్వ పథకాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని సూచించారు. లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయడమే తమ లక్ష్యమని తెలిపారు.
సీఎం మాట్లాడుతూ, తాను రాజకీయాల్లో ఉన్న కారణంగా డబ్బులు సంపాదించలేకపోయానని, తన భార్య భువనేశ్వరి వ్యాపారం చేసి ఎంతో ముందుకు వెళ్లిందని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం భువనేశ్వరి తనకే డబ్బులు ఇచ్చే స్థాయికి ఎదిగిందని, ఇది మహిళలు ఆర్థికంగా ఎదగాల్సిన అవసరాన్ని తెలియజేస్తుందని అన్నారు. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వ సహకారం పెంచి మరింత ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ రూపొందించిన “శక్తి” యాప్‌ను ప్రారంభించారు. చేనేత ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించేందుకు ప్రత్యేక చేనేత రథాన్ని ప్రారంభించారు. మహిళా వ్యాపార వృద్ధికి సహాయపడే ఈ-వ్యాపారి పోర్టల్ డెలివరీని కూడా ప్రారంభించారు. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.