మలయాళ నటుడు షైన్ టామ్ చాకో సింపుల్ లుక్ తో పవర్ ఫుల్ విలనిజం చూపించడంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘వివేకానందన్ విరలను’ సినిమా గత ఏడాది మలయాళంలో విడుదలై మంచి స్పందన పొందింది. ఇప్పుడు అదే సినిమా ‘వివేకానందన్ వైరల్’ పేరుతో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమాలో షైన్ టామ్ చాకో సరసన ఐదుగురు నాయికలు నటించారు. శ్వాసిక విజయ్, గ్రేస్ ఆంటోని, మెరీనా మైఖేల్, రమ్య సురేశ్, మంజు పిళ్లై ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు మలయాళ సినీ పరిశ్రమలో ప్రఖ్యాతి గాంచిన దర్శకుడు కమల్ దర్శకత్వం వహించారు. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుంది.
కథ విషయానికి వస్తే, వివేకానందన్ అనే వ్యక్తి విలాస జీవితాన్ని కోరుకుంటాడు. తన భార్య సితార ఓ ప్రభుత్వ ఉద్యోగినిగా గ్రామంలో ఉంటుండగా, వివేకానందన్ నగరంలో అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాడు. తీరా ఒక రోజు అతని మోసపూరిత జీవితం బయటపడుతుంది.
అతని నిజస్వరూపం బయటకొచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? వివేకానందన్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? చివరకు ఆయన జీవితంలో ఏమి జరిగిందనేది ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమా వినోదాత్మకంగా, భావోద్వేగాలతో మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకుంది.