అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ మిశ్రా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. మహిళ ఛాతిని తాకడం అత్యాచార కిందకు రాదంటూ ఇచ్చిన తీర్పుపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి తీవ్రంగా మండిపడ్డారు. సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఈ తీర్పును సుప్రీంకోర్టు పునఃపరిశీలించాలని ఆమె డిమాండ్ చేశారు.
2021లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన లైంగిక వేధింపుల కేసు విచారణ సందర్భంగా, న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు నిందితులకు అనుకూలంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 11 ఏళ్ల బాలికను యువకులు అసభ్యంగా తాకి వేధించారని కేసు నమోదైన నేపథ్యంలో, హైకోర్టు తీర్పుపై మహిళా సంఘాలు, రాజకీయ నాయకులు కూడా భగ్గుమంటున్నారు.
ఈ వివాదంపై కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి తీర్పుల వల్ల లైంగిక వేధింపులకు గురైన మహిళలు న్యాయం పొందే హక్కును కోల్పోతారన్నారు. మహిళా రక్షణ కోసం కఠిన చట్టాలు ఉండాల్సిన అవసరం ఉందని, హైకోర్టు తీర్పు నేరస్తులకు ప్రోత్సాహంగా మారుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
సమాజంలో మహిళలకు న్యాయం దక్కాలంటే, కోర్టులు బాధితుల పక్షంలో నిలవాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ తీర్పును సుప్రీంకోర్టు సమీక్షించి, బాధితులకు న్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు కూడా ఈ తీర్పుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.