TTD Srivani Darshan Tickets: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వరుస సెలవుల కారణంగా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం సాధారణ దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుండటంతో, భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో ఆఫ్‌లైన్ విధానంలో జారీ చేసే శ్రీవాణి దర్శన టిక్కెట్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం రేపటి నుంచి మూడు రోజుల పాటు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికే డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు శ్రీవాణి దర్శన టిక్కెట్ల జారీని నిలిపివేసిన విషయం తెలిసిందే.
అయితే జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు శ్రీవాణి దర్శన టిక్కెట్లను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే విక్రయించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
ALSO READ:Bank Holidays 2026 | జనవరిలో 15 రోజులు సెలవులు..పండగే పండగ
భక్తుల రద్దీ నియంత్రణ కోసం ఇకపై ఆఫ్‌లైన్ కౌంటర్లను పూర్తిగా రద్దు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. జనవరి 9 నుంచి శ్రీవాణి దర్శన టిక్కెట్ల పునరుద్ధరణపై సమీక్ష చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
భవిష్యత్తులో సంపూర్ణంగా ఆన్‌లైన్ విధానంలోనే దర్శన టిక్కెట్ల జారీపై దృష్టి సారించిన టీటీడీ, ఒక రోజు ముందుగానే రోజుకు 1,000 శ్రీవాణి దర్శన టిక్కెట్లను విడుదల చేసే యోచనలో ఉంది.
ఇదే సమయంలో తిరుమలతో పాటు రేణిగుంట విమానాశ్రయంలో ఉన్న ఆఫ్‌లైన్ కౌంటర్లను కూడా రద్దు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. భక్తుల దర్శన సౌకర్యాలు మెరుగుపరచడం, రద్దీని సమర్థవంతంగా నియంత్రించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
