అమెరికాలో అక్రమంగా ఉన్న వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడంలో ట్రంప్ దృష్టి పెట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్, జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కీలకమైన క్యాబినెట్ నియామకాల్లో తనకు నమ్మకస్తులను, సమర్థులను ఎంపిక చేస్తున్నారు.
ట్రంప్ సన్నిహిత వర్గాల ప్రకారం, అక్రమ వలసదారుల డిపోర్టేషన్ కోసం బోర్డర్ సెక్యూరిటీ పై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. అవసరమైతే జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి, సైనిక బలగాల సాయంతో అక్రమ వలసదారుల్ని వెతికి పట్టుకుని వారి దేశాలకు పంపించనున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియలో బోర్డర్ల భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ట్రంప్ నిర్ణయించారు.
మెక్సికో బోర్డర్ నుంచి అక్రమంగా అమెరికాలోకి వస్తున్న మార్గాలను మూసివేయడమే కాకుండా, సాంకేతిక పరిజ్ఞానంతో భద్రతా చర్యలను మెరుగుపరచాలని ట్రంప్ పేర్కొన్నారు. అక్రమ మార్గాల్లో దేశంలోకి ప్రవేశించి అధికారుల కళ్లుగప్పి ఉన్నవారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ట్రూత్ సోషల్’ ద్వారా నేషనల్ ఎమర్జెన్సీపై సంకేతాలు పంపించారు. ఈ ప్రకటనతో అమెరికాలో ఉన్న అక్రమ వలసదారుల్లో ఆందోళన నెలకొంది. డిపోర్టేషన్ చర్యలు మరింత వేగవంతం కావడంతో వీరి భవిష్యత్తు ప్రమాదంలో పడిందనే భావన వ్యక్తమవుతోంది.