అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం రాజంపాలెం గ్రామంలో గిరిజనులు సంప్రదాయంగా పప్పుల పండుగను జరుపుకున్నారు. పొలాల్లో పండించిన కందిపప్పులను ఇంటికి తెచ్చిన తర్వాత ఈ పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గిరిజన మహిళలు భక్తిశ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా గ్రామంలోని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ కలిసి ఉత్సాహంగా పాల్గొంటారు. మహిళలు, చిన్నపిల్లలు గిరిజన వేషధారణలో పాల్గొని ఊరేగింపులు నిర్వహిస్తారు. గిరిజన వృత్యాలతో పాటలు పాడుతూ, మేకపోతును ఊరేగిస్తూ సంబరాలు చేస్తారు. ఈ విధంగా గ్రామమంతా ఉత్సాహంతో మైదానంగా మారుతుంది.
గ్రామ శివారులో గిరిజనులు ఈతమట్టలతో పందిరి వేయించి, మట్టితో అమ్మవారి రూపాన్ని అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొత్తగా తెచ్చిన కందిపప్పులతో పప్పన్నం వండి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. పండుగ శోభను పెంచేందుకు కోళ్లను, మేకపోతులను బలి ఇచ్చి సంప్రదాయాన్ని పాటిస్తారు.
ఈవెంట్ టీవీ ప్రతినిధి గిరిజన మహిళను ఈ పండుగ విశేషాలను అడిగితే, పూర్వం నుంచి తమ పెద్దలు నిర్వహించిన విధంగా ఇప్పటికీ జరుపుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్ తరాలకు ఈ సంప్రదాయాలను అందిస్తూ, తమ ఆచారాలను కాపాడుకోవాలని గిరిజనులు ఆకాంక్షించారు.