Telangana Ration Cards: తెలంగాణ రాష్ట్రంలో ఆహార భద్రత పరిధి వేగంగా విస్తరిస్తోంది. రేషన్ కార్డుల సంఖ్యతో పాటు వాటి ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది.
2026 జనవరి 23 నాటికి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 1,04,35,848కు చేరినట్లు పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. వీటి ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 3,35,96,875కు పెరిగింది.
కొత్త రేషన్ కార్డుల మంజూరు, అలాగే ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల చేర్పు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. గత ఏడాదిలోనే 14.40 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరవడం విశేషం. ఈ కార్డుల ద్వారా 54,49,310 మంది కొత్త లబ్ధిదారులు రేషన్ వ్యవస్థలోకి చేరారు. 2026 జనవరి నెలలో మాత్రమే 46,153 కొత్త కార్డులు జారీ అయ్యాయి.
2025 జనవరి 1 నాటికి రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డులు 89,95,282గా ఉండగా, ఏడాది 22 రోజుల వ్యవధిలో ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం జాతీయ ఆహార భద్రత కార్డులు 56,57,001కు, రాష్ట్ర ఆహార భద్రత కార్డులు 47,78,848కు చేరాయి.
కేంద్ర కార్డుల ద్వారా 1.91 కోట్ల మందికి, రాష్ట్ర కార్డుల ద్వారా 1.44 కోట్ల మందికి రేషన్ సరఫరా జరుగుతోంది. మొత్తం మీద రాష్ట్రంలో సుమారు 3.35 కోట్ల మందికి ప్రతినెల ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచిత సన్నబియ్యం అందజేస్తున్నారు.
