Mahabubnagar IIIT campus: తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త అందించింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని చిట్టెబోయినపల్లి గ్రామ శివారులో ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ (IIIT) క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.600 కోట్ల అంచనా వ్యయంతో ఈ విద్యాసంస్థను నిర్మించనున్నారు.
భూమి పూజ అనంతరం సీఎం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి భవిష్యత్తు లక్ష్యాలపై చర్చించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చడమే ఈ ట్రిపుల్ ఐటీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Also Read:sudha murty on india partition | దేశ విభజన’పై సుధామూర్తి వ్యాఖ్యలు
ఈ సంస్థ ద్వారా స్థానిక విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాల సాంకేతిక విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్మిస్తున్న అతిపెద్ద విద్యా సంస్థలలో ఈ IIIT ఒకటిగా నిలవనుంది. నిర్మల్ జిల్లా బాసర తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న రెండో ట్రిపుల్ ఐటీ ఇదే కావడం విశేషం.
వెనుకబడిన పాలమూరు ప్రాంతంలో ఈ సంస్థ ఏర్పాటు కావడం వల్ల, ఉన్నత విద్య కోసం ఇతర రాష్ట్రాలు లేదా దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం విద్యార్థులకు తగ్గనుంది.
ఇంజనీరింగ్, ఐటీ, సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా ఈ క్యాంపస్ అభివృద్ధి చెందనుందని అధికారులు భావిస్తున్నారు. దీని ద్వారా విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
