ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే, ఈ భయాన్ని పట్టించుకోకుండా, ధైర్యంగా విద్యార్థులు పులిగుండాల ప్రాజెక్టుకు విహారయాత్రకు వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దర్శిని కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను ప్రకృతి పరిచయం చేసేందుకు ఈ ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు.
ఈ వనయాత్రలో పెనుబల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఫారెస్ట్ అధికారుల సహాయంతో అడవిలోని జీవవైవిధ్యాన్ని అనుభవించారు. తల్లాడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉమా విద్యార్థులకు అడవులపై అవగాహన పెంచేలా వివరణ ఇచ్చారు. చెట్లు కాపాడటంతో పర్యావరణానికి కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.
విద్యార్థులు పులిగుండాల ప్రాజెక్టు వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆటపాటలతో విహారయాత్రను ఆనందంగా గడిపారు. అనంతరం బీట్ ఆఫీసర్లు, ఉపాధ్యాయుల సమక్షంలో ఫారెస్ట్ ప్రాముఖ్యతపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో విద్యార్థులకు వన్యప్రాణులు, అడవుల సంరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తాసిల్దార్, ఎంపీడీవో, రేంజర్ ఉమా పాల్గొన్నారు. రేంజర్ ఉమా మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రతి విద్యార్థి జీవితంలో చెట్ల ప్రాముఖ్యతను గుర్తించి, ప్రతి శుభకార్యానికి ఓ మొక్క నాటాలని సూచించారు.