ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలకు ఆధార్ కార్డు జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఆధార్ కార్డు లేని 11.65 లక్షల మంది చిన్నారుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ క్యాంపులు ప్రారంభమవుతాయి.
ప్రభుత్వం ఆధార్ నమోదు ప్రక్రియను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా, గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పిల్లలకు ఆధార్ కార్డును నమోదు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్యాంపుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
పిల్లల ఆధార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలు, విద్యా సంక్షేమ కార్యక్రమాలు మరింత సులభంగా లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లు, గ్రామ సచివాలయ అధికారులకు ముఖ్యమైన మార్గదర్శకాలను జారీ చేశారు.
ఈ క్యాంపుల ద్వారా చిన్నారుల ఆధార్ నమోదు సంఖ్యను గణనీయంగా పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. పేరెంట్స్ ఆధార్, పిల్లల జనన ధృవీకరణ పత్రం, స్కూల్ ఐడీ వంటి పత్రాలతో హాజరై ఆధార్ నమోదు పూర్తి చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ప్రత్యేక సహాయాన్ని అందించనున్నారు.