మహాశివరాత్రి సందర్భంగా నర్సీపట్నం బలిఘట్టం స్నాన ఘట్టాలను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సందర్శించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో, వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పట్టణ సీఐ గోవిందరావుకు పోలీస్ బందోబస్తును పకడ్బందిగా ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ, మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినమని తెలిపారు. నర్సీపట్నం ఉత్తర వాహినిని “దక్షిణ కాశీ”గా పిలుస్తారని, పూర్వం నుండి భక్తులు ఇక్కడ స్నానం చేసి శివాలయంలో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని వివరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
2018లో భక్తుల సౌకర్యార్థం స్నాన ఘట్టాలను నిర్మించినట్లు గుర్తుచేశారు. అలాగే, అదే ఏడాది గంగా హారతిని ప్రారంభించామని తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 26న సాయంత్రం గంగా హారతి నిర్వహించనున్నామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే నేపథ్యంలో విశేష ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 27న ఉదయం అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం అందించనున్నట్లు వెల్లడించారు. పాకలపాడు గురువుగారి ఆశ్రమం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరిపి, భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.