జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించాలని పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా జిల్లా RTA శాఖ ఆధ్వర్యంలో కృష్ణ వేణి చౌక్ వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించిన అనంతరం ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు.
కృష్ణ వేణి చౌక్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ న్యూ బస్ స్టాండ్, సుంకులమ్మ మెట్టు, ఓల్డ్ బస్ స్టాండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చిన్న పొరపాట్ల కారణంగా పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం ప్రమాదకరమని సూచించారు. విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యత తెలియజేయాలని చెప్పారు.
యువత ట్రాఫిక్ నియమాలను అతిక్రమించి వాహనాలు నడపడం హీరోయిజం కాదని, అలాంటి నిర్లక్ష్యం కుటుంబాలను వీధికి వచ్చేటట్లు చేస్తుందని అన్నారు. అతివేగం, అత్యధిక సంఖ్యలో ఆటోల ప్రయాణం వంటి ప్రమాదకరపు చర్యలతో ప్రమాదాలు పెరుగుతున్నాయని, ప్రతి వాహనదారుడు క్రమశిక్షణతో వాహనం నడపాలని సూచించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు విధించే జరిమానాలు వాహనదారుల భద్రత కోసమేనని ఆయన స్పష్టం చేశారు.
జాతీయ రోడ్ భద్రతా మహోత్సవాల సందర్భంగా ఈ నెల మొత్తం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. ఈ ర్యాలీలో జిల్లా పోలీస్ అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కలిగించేందుకు ప్రజా వాహనాలకు హెల్మెట్ స్టిక్కర్స్‌ను జిల్లా ఎస్పీ స్వయంగా అంటించారు.