ఏపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ కనెక్షన్‌ల స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రాజెక్టును రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు భారీ షాక్ తగలనుంది. రాష్ట్రంలో మొత్తం 18.58 లక్షల కనెక్షన్‌లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో రైతులు, ప్రజా సంఘాలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించాయి. అప్పట్లో తెలంగాణ సీఎం కేసిఆర్ కూడా స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తన ప్రభుత్వం అనుమతించలేదని స్పష్టం చేశారు. అయితే, ఏపీ జగన్ ప్రభుత్వం 2 శాతం అదనపు రుణాల కోసం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందని కేసిఆర్ విమర్శించారు. ఈ ప్రాజెక్టు ద్వారా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కు లాభం చేకూర్చడమే లక్ష్యమని ఆరోపణలు కూడా వచ్చాయి.
ప్రాజెక్టు ప్రారంభ దశలోనే 50 వేల కనెక్షన్‌లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. అయితే, ఈ నిర్ణయం రైతుల ప్రయోజనాలను కాపాడదని భావించిన కూటమి సర్కార్, ప్రాజెక్టును ఈ దశలోనే రద్దు చేసింది. ఈ నిర్ణయం రైతులు, ప్రజా సంఘాల అభిప్రాయానికి అనుగుణంగా తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ప్రాజెక్టు రద్దు ద్వారా భారీగా నిధుల ఆదా అవుతుందని కూటమి ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. స్మార్ట్ మీటర్ల పథకం పూర్తిగా నిలిపివేయడం వల్ల రైతులు ఆర్థిక భారం నుండి ఉపశమనం పొందుతారని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
