మెదక్ జిల్లా రామాయంపేట ఉమ్మడి మండలంలో బీఆర్‌ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరితో పాటు 1500 మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.
చేరికల సందర్భంగా కాంగ్రెస్ నేతలు భారీ స్వాగత కార్యక్రమాలు నిర్వహించారు. రామాయంపేట పట్టణంలో బతుకమ్మ బోనాలతో స్వాగతం పలికారు. అనంతరం క్రేన్ సహాయంతో గజమాలతో సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉందని, పార్టీలో చేరిన వారందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ నేతలు కృషి చేయనున్నట్లు ప్రకటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని, పార్టీలో కొత్తగా చేరిన వారికి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు, దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సరాఫ్ యాదగిరి, నిజాంపేట మాజీ ఎంపీపీ సిద్ధిరాములు, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.