భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆనందపురం మండలం రామవరం పంచాయతీకి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు, భీమిలి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాకరపూడి వరహాలరాజు, ఆయన కుమారుడు శ్రీకాంత్ రాజు టీడీపీలో చేరారు. బుధవారం శొంట్యాంలో జరిగిన కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వారి చేతుల మీదుగా టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ 2014-19 మధ్యలో మంత్రిగా గంటా శ్రీనివాసరావు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ప్రజలు ఆయనను 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. తమ ప్రాంత అభివృద్ధి కోసం గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పని చేయాలని తాము టీడీపీలో చేరినట్లు వివరించారు. భీమిలిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పాటుపడతానని శ్రీకాంత్ రాజు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కణమాం ఎంపీటీసీ గొలగాని కృష్ణ, మాజీ సర్పంచ్ సీతారామరాజు, శొంట్యాం సొసైటీ మాజీ డైరెక్టర్ ఎం.సత్తిబాబు సహా 200 మంది టీడీపీలో చేరారు. వీరందరికీ గంటా శ్రీనివాసరావు స్వాగతం పలికారు. టీడీపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కొత్త సభ్యులను అభినందించారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు గాడు చిన్ని కుమారి లక్ష్మి, లొడగల అప్పారావు, తర్లువాడ సర్పంచ్ బి.ఆర్.బి.నాయుడు, ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్, టీడీపీ నాయకులు డి.ఎ.ఎన్.రాజు, తాట్రాజు అప్పారావు, కె.దామోదరరావు, కాళ్ల నగేష్ కుమార్, అప్పలరాము తదితరులు పాల్గొన్నారు.