ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రష్యా మరియు ఉత్తరకొరియా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఉత్తరకొరియా నుంచి రష్యాకు పెద్ద మొత్తంలో సైనిక సాయం అందించబడుతోంది. తాజా పరిణామంలో, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తో రష్యా సహజవనరులు, జీవావరణ మంత్రి అలెగ్జాండర్ క్లోజోవ్ సమావేశమయ్యారు.
ఈ భేటీ స్నేహపూర్వకంగా సాగిందని ఉత్తరకొరియా అధికారిక వార్తా సంస్థ తెలిపింది. వాణిజ్యం, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక సహకారంతో పాటు పలు అంశాలపై నేతలు చర్చించారు. ఇది రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మెరుగుపరచడానికి ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు.
ఇతర వివరాల ప్రకారం, రష్యన్ మిలిటరీ అకాడమీ ప్రతినిధులు కూడా ఉత్తరకొరియాలో పర్యటించారు. రష్యా-ఉత్తరకొరియా మధ్య సైనిక, శాస్త్ర సాంకేతిక సహకారం పెరుగుతున్న సూచనలుగా ఈ కార్యక్రమాలను విశ్లేషిస్తున్నారు.
ఈ సమావేశాలు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రష్యా-ఉత్తరకొరియా మధ్య బలపడుతున్న సంబంధాలు యుద్ధ పరిస్థితులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.