ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ తన ఆటతీరుతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇంగ్లండ్ లయన్స్ తరఫున అతిపిన్న వయసులో (16 ఏళ్లు 291 రోజులు) శతకం సాధించిన ఆటగాడిగా నిలిచాడు. తన తండ్రి 20 ఏళ్ల వయసులో చేసిన రికార్డును రాకీ అధిగమించడం విశేషం.
ఆండ్రూ ఫ్లింటాఫ్ 1998లో కెన్యాపై శతకం సాధించగా, 26 ఏళ్ల తర్వాత రాకీ క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్‌పై సెంచరీ చేయడం చరిత్ర సృష్టించింది. తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ లయన్స్ జట్టును రాకీ అద్భుతంగా ఆదుకున్నాడు.
తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రాకీ 124 బంతుల్లో 108 పరుగులు చేసి జట్టును గాడిలో పెట్టాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ లయన్స్ జట్టు మొత్తం 316 పరుగులు చేయగా, తమ ప్రత్యర్థిపై 102 పరుగుల ఆధిక్యం సాధించింది.
ఆస్ట్రేలియా ఎలెవెన్ తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్ లయన్స్ మెరుగైన స్థితిలో నిలిచింది. రాకీ ఫ్లింటాఫ్ ఈ శతకంతో తన తండ్రికి తగ్గ తనయుడిగా మరోసారి నిరూపించుకున్నాడు.