రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు టెండర్ల అవినీతి కేసులో హైకోర్టులో ఊరట పొందారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలతో 2021లో కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ ఏబీవీ 2022లో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
సోమవారం జరిగిన విచారణలో, హైకోర్టు తీర్పును రిజర్వు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ కేసుపై విచారణను నిలిపివేయాలని స్టే విధించింది. పిటిషనర్ తరపున ప్రముఖ న్యాయవాది బి. ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఇది ఏబీవీకి తాత్కాలిక ఊరటగా భావిస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే కేసులో ఏబీవీని సస్పెండ్ చేసింది. ఆ ఉత్తర్వులపై హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఆయన న్యాయపోరాటం చేశారు. చివరకు సుప్రీం కోర్టు ఉత్తర్వుల అనంతరం సస్పెన్షన్ ఎత్తివేసి, ఆయన్ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగంలో అడిషనల్ డీజీగా నియమించారు.
అయితే పదవులు చేపట్టిన వెంటనే మరలా సస్పెండ్ చేయగా, ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్ ఆ ఉత్తర్వులను రద్దు చేయడంతో పదవీ విరమణకు ముందు రోజు మళ్లీ పోస్టింగ్ ఇచ్చారు. ఆ రోజే ఆయన తన డ్యూటీని చేపట్టి పదవీ విరమణ చేశారు. తాజా హైకోర్టు తీర్పుతో ఈ కేసులో ఆయనకు మళ్లీ న్యాయపరమైన ఊరట లభించినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు.