రూ.2000 నోట్లను ఆర్బీఐ ఉపసంహరించినట్లు ప్రకటించి దాదాపు రెండేళ్లు కావస్తున్నా, ఇంకా చాలా వరకు ఈ నోట్లు ప్రజల వద్దే ఉన్నట్లు తేలింది. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం, ఏప్రిల్ 30, 2025 నాటికి రూ.6,266 కోట్ల విలువైన రూ.2000 నోట్లు బ్యాంకులకు తిరిగి రాలేదని వెల్లడించింది. ఇది మొత్తం చలామణిలో ఉన్న నోట్లలో 1.76 శాతమే అయినప్పటికీ, ఇది గణనీయమైన మొత్తం కావడం గమనార్హం.
2023 మే 19న ఆర్బీఐ ఈ నోట్లను చలామణి నుంచి తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ సమయానికి దేశవ్యాప్తంగా రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. ప్రజలకు మార్పిడి లేదా డిపాజిట్ చేసేందుకు 2023 అక్టోబర్ 7 వరకు సమయమిచ్చారు. అయితే తర్వాత మార్పిడి సేవలను ఆర్బీఐ యొక్క ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కొనసాగించారు.
ఇప్పటి వరకు 98.24 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ వెల్లడించింది. కానీ మిగిలిన నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నాయంటే, అవి చట్టబద్ధ మార్గాల్లో ఉపయోగించబడలేకపోవచ్చు. ఈ నోట్లను మార్చుకోవాలనుకునే వారు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించవచ్చని సూచించింది.
అలాగే, కార్యాలయాలకు స్వయంగా వెళ్లలేని వారు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లు పోస్టల్ ద్వారా ఆర్బీఐ కార్యాలయాలకు పంపితే, వాటికి సమానమైన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది. నోట్లను చట్టబద్ధంగా మార్చుకోవడానికి ఇది తుదివేళ అని ఆర్బీఐ సూచిస్తోంది. ప్రజలు తక్షణమే చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.