ఏరో ఇండియా-2025లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు యుద్ధ విమానాన్ని నడిపారు. హెచ్ఏఎల్ స్వదేశీ నిర్మాణమైన హెచ్ జేటీ-36 ‘యశస్’ జెట్‌లో ఆయన ప్రయాణించారు. ఇది ఆయనకు మరచిపోలేని అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. భారత వైమానిక పరిశ్రమ పురోగమిస్తున్న తీరును ప్రశంసించారు.
హెచ్ జేటీ-36 ‘యశస్’ విమానం భారతదేశంలో తయారైన అతికొద్ది యుద్ధ విమానాల్లో ఒకటి. దీని రూపకల్పన, తయారీ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో జరిగిందని మంత్రి పేర్కొన్నారు. భారత వైమానిక, రక్షణ రంగం కొత్త శిఖరాలను చేరుతోందని అభిప్రాయపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనలో ఈ విమానం మరో ముందడుగు అని ఆయన అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా తయారు చేసిన యుద్ధ విమానాలు గర్వించదగిన విషయమని వెల్లడించారు.
భవిష్యత్తులో మరిన్ని అత్యాధునిక విమానాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశీయ పరిశ్రమలు స్వదేశీ ఉత్పత్తిని మరింతగా ప్రోత్సహించాలని సూచించారు.