రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్-రష్యా వివాద పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రపంచ దేశాధినేతలకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా సహా ఇతర దేశాల నాయకులు ఈ సమస్య పరిష్కారానికి సమయం కేటాయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
పుతిన్ మాట్లాడుతూ, “కాల్పుల విరమణకు తాము అంగీకరిస్తున్నాము. ఇది శాశ్వత శాంతికి దారితీయాలని ఆకాంక్షిస్తున్నాము” అని అన్నారు. అమెరికా ప్రతిపాదించిన ’30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం’ సుసాధ్యమయ్యేలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ వివాద పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. “భారత్ ఎప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంది. సమస్యలకు యుద్ధం, హింస పరిష్కారం కాదు” అని మోదీ పేర్కొన్నారు. శాంతి స్థాపనకు భారత్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు.
ఈ పరిణామాలు ఉక్రెయిన్-రష్యా వివాదంలో శాంతి స్థాపనకు దారితీయాలని ప్రపంచం ఆశిస్తోంది. ప్రపంచ నాయకుల కృషి ఫలించి, ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి నెలకొల్పాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.